బాల్యం మాకివ్వండి
ఏ పాపం చేశామో......
ఈ భారం మోస్తున్నాం
వెట్టి చాకిరి చేస్తున్నాం
మేము బాలలమే ........ అయిన
కార్మికులం ! బాల కార్మికులం !!
పాపమెవరిదో పుణ్యమెవరిదో
ఫలితం మాత్రం నలిగే మా పసి ప్రాయం
ఎందులకీ శాపం ?
ఎవ్వరిదీ ఈ పాపం ?
పేదరికంలో పుట్టినందుకా ?
పట్టెడన్నం దొరకనందుకా ?
తల్లిని తండ్రిని కొల్పోయాం
అయినవారికి భారమయ్యాం
దిక్కులేక అనాధలయ్యాం
మాకు కన్నీరే కాదు .......
మాకు కలలు ఉన్నాయ్.......
పలక బలపం పట్టాలని
అక్షర జ్ఞానం పొందాలని
ఆడుతు పాడుతు వుండాలని
అందరిలాగా బ్రతకాలని
ఉన్నత స్థాయికి ఎదగాలని
అందరి మేలు కోరాలని
ఉన్నాయ్ ఉన్నాయ్
మాకు కలలున్నాయ్
మాకు కోరికలున్నాయ్
దయగల ఓ అయ్యల్లారా ......
పాలించే ఓ బాబుల్లారా......
మీ పిల్లలా కాకున్నా
మేము పిల్లలమే అని గుర్తించండి బ్రతుకివ్వండి
మా బాల్యం మాకివ్వండి
( జూన్ 12 న బాల కార్మిక నిర్మూలన దినోత్సవంగా బాల కార్మికుల ఆవేదన)
సి.హెచ్.సూర్య బ్రహ్మం, ఒంగోలు
సెల్: [[1]]