జీవనయానము
అనంతపురం జిల్లా హిందూపురానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మణేసముద్రం ఓ కుగ్రామం. శతాబ్ది కాలానికి పూర్వం బ్రహ్మశ్రీ మాడ్గుల వేంకటేశ్వర శాస్త్రి అనే వేద శాస్త్ర పండితులు ఈ గ్రామంలో నివసించేవారు. ఆయనది ఆయుర్వేద వైద్యశాస్త్రంలో కూడా అందెవేసిన చెయ్యి కావడంతో చుట్టు పక్కల గ్రామాల నుండి వైద్యం చేయించుకోవడానికి వీరివద్దకు జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. వేంకటేశ్వర శాస్త్రి గారి హస్తవాసి మంచిదనే పేరు ప్రజల్లోకి వెళ్ళింది. అయితే ఎవరి వద్ద నుండి అణాపైసా కూడా తీసుకోకుండా ఉచితంగా చికిత్స చేసి పంపే వారు శాస్త్రి గారు. మరో వైపు తమ వంశపారంపర్యమైన పౌరోహిత్య వైదిక కార్యక్రమాలను కూడా నిరాటంకంగా నిర్వహించేవారు. లోకక్షేమం కోసం వీరు చేసే యజ్ఞ యాగాది క్రతువుల కారణంగా గ్రామమంతా సస్యశ్యామలంగా విలసిల్లుతూ ఉండేది. శాస్త్రిగారి ధర్మపత్ని సావిత్రమ్మ పేరుకు తగ్గట్టుగానే ఉత్తమ ఇల్లాలు. భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. వారికి తొలుత ఒక స్త్రీ సంతానం కలిగింది. శాస్త్రిగారు. తమ తల్లిగారైన భాగీరథమ్మ గారినే తలచుకొని శిశువుకు భాగీరథి అని పేరు పెట్టారు. తదుపరి శ్రీ రక్తాక్షి నామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం పుబ్బ నక్షత్రం సింహరాశిలో (10-03-1925వ సంవత్సరంలో) బ్రహ్మశ్రీ మాడ్గుల వేంకటేశ్వర శాస్త్రి గారికి పుత్రసంతానం కలిగింది. కులదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పేరు, అపారమైన శివభక్తి తత్పరుడైనందున శివుని పేరు కలిసి ఉండేటట్లు వేంకటశివ శాస్త్రి అని పేరు పెట్టుకుని మురిసిపోయారు శాస్త్రి దంపతులు. వీరి రెండవ అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శాస్త్రి. వెంకట శివశాస్త్రికి ఎనిమిది సంవత్సరాల వయస్సు, సుబ్రహ్మణ్య శాస్త్రికి నాలుగు సంవత్సరాల వయస్సు వచ్చేసరికి హఠాత్తుగా తండ్రి వేంకటేశ్వర శాస్త్రి తనువు చాలించాడు. ముగ్గురు పిల్లల పోషణభారం తల్లి సావిత్రమ్మపై పడింది. అప్పటికి వెంకటశివ శాస్త్రి వయస్సు ఎనిమిది సంవత్సరాలు, సుబ్రహ్మణ్య శాస్త్రి వయస్సు నాలుగు సంవత్సరాలు. శ్రోత్రియ భూస్వాములైనప్పటికీ భర్త గతించడంతో పూటగడవడం కష్టంగా మారింది. ఎలాగోలా కుటుంబ భారాన్ని నెట్టుకొచ్చింది సావిత్రమ్మ. కూతురు భాగీరథిని పందిపర్తిలో దేవరకొండ వేంకట పతిరావు అనే యువకునికిచ్చి పెండ్లి చేసింది. ఈయన వీరికి దగ్గర బంధువు కూడా. శాస్త్రిగారి ఇంటికి వెనుకే నివాసముండే కళ్ళే నరసింహ శాస్త్రి-గౌరమ్మ దంపతులు వెంకట శివ శాస్త్రిని, సుబ్రహ్మణ్య శాస్త్రిని అక్కున చేర్చుకొని ఉపనయనం చేసి వేదవిద్యను నేర్పించసాగారు. పెద్దవాడైన వెంకట శివ శాస్త్రి వీరి వద్ద వేదవిద్యనభ్యసించిన అనంతరం బెంగళూరులోని ఒక వేద పాఠశాలలలో సంపూర్ణంగా స్నాతకం పూర్తి చేసి, వేలూరులో ఆయుర్వేదంలో సర్టిఫికెట్ కోర్సు కూడా పూర్తి చేశారు. తండ్రి బాటలో పయనిస్తూ వైదిక కార్యక్రమాలతో పాటు ఉచితంగా ఆయుర్వేద వైద్యం చేసేవారు. వెంకటశివశాస్త్రికి యుక్తవయసు వచ్చాక సుబ్బలక్ష్మమ్మతో వివాహమైంది. అప్పటి స్వాతంత్ర్యోద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరి మణేసముద్రం గ్రామానికి సర్పంచుగా మూడు పర్యాయాలు ఎన్నికై పదిహేను సంవత్సరాల పాటు సర్పంచిగా ప్రజాసేవలో తరించారు. గ్రామీణ బ్యాంకు ప్రెసిడెంట్ గా కూడా ఎంపికై ఎందరో పేద రైతులకు ఋణాలు ఇప్పించి సహకారాలందించారు. కొంతకాలానికి అనంతపురం పట్టణానికి వచ్చి స్థిరపడి ఆరు దశాబ్దాలకు పైగా వేద-జ్యోతిష్య-వాస్తు శాస్త్రాలలో ఎనలేని సేవలు అందించారు. వేదవిద్యకోసం వచ్చిన వారికి విధివిధానంగా వేదవిద్యను ఉచితంగా బోధించి వారందిరినీ ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. దీంతో వీరికి జిల్లాలోనే కాకుండా రాయలసీమలో కూడా వేలాది మంది శిష్యగణం ఏర్పడింది. వేంకటశివ శాస్త్రిగారి తమ్ముడు సుబ్రహ్మణ్య శాస్త్రి వేదవిద్యతో పాటు గణిత విద్యను కూడా అభ్యసించి బి.యస్.సి పట్టా పుచ్చుకొని కోపరేటివ్ హేండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రభుత్వోద్యోగం సంపాదించుకొని అంచెలంచలుగా ఎదిగి సబ్ రిజిస్ట్రార్ అయ్యారు. అన్నగారి ఆదేశాలను ఎన్నటికీ జవదాటకుండా చేదోడు వాదోడుగా ఉంటూ అనంతపురంలోనే కాక చుట్టు పక్కల ప్రాంతాలు పర్యటిస్తూ వైదిక కార్యక్రమాలు జరిపారు. వేంకటశివ శాస్త్రి, సుబ్రహ్మణ్య శాస్త్రి సోదరులకు అనంతపురంలో శాస్త్రి బ్రదర్స్ అనే పేరు స్థిరపడింది. అనంతపురంలో మాడ్గులశాస్త్రి సోదరుల పేరు తెలియని వైదికులుండరంటే అతిశయోక్తి కాదు. అలా శ్రీ మాడ్గుల వేంకటశివ శాస్త్రి గారు వారి జీవితకాలంలో సంపాదించిన అపారమైన విద్యాజ్ఞానాన్ని గ్రంథరూపంలో సంకలనం గావించారు. దశాధిక గ్రంథాలు ముద్రించారు. ఈ లోకంనుండి భౌతికంగా దూరమైనా వైదికలోకంలో శాశ్వతంగా నిలచిపోయారు. [1]